న్యూఢిల్లీ: ఏడేళ్ల క్రితం రాజధానిలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. తన స్నేహితుడితో కలిసి దక్షిణ ఢిల్లీ పరిధిలో ఉన్న మునిర్కకు వెళ్లేందుకు బస్సు ఎక్కిన నిర్భయపై కామాంధులు అకృత్యానికి పాల్పడ్డారు. చిత్ర హింసలు పెట్టి.. ఆమెను, స్నేహితుడిని రోడ్డు మీదకు విసిరేశారు. ఆ తర్వాత ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించి విఫలమై... వేర్వేరు ప్రాంతాల్లో తలదాచుకున్నారు. అయితే దేశ రాజధానిలో ఈ ఘటన జరగడం, మీడియా కూడా ఈ విషయంలో త్వరగా స్పందించడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అనేక పరిణామాల వారిని దోషులుగా తేల్చిన కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే ఆనాటి నుంచి నేటి దాకా నిర్భయ కేసులో బాధితురాలి తల్లిదండ్రులకు ఎంతో మంది అండగా నిలిస్తే.. దోషులకు మాత్రం ఒకే ఒక వ్యక్తి పూర్తి మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో ఆయన కేవలం న్యాయవాదిగా తన కర్తవ్యాన్ని నెరవేరిస్తే ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండేది కాదు.. కానీ ఆయన అలా చేయలేదు. బాధితురాలి వ్యక్తిత్వాన్ని, మహిళల వస్త్రధారణ ఇతరత్రా విషయాలపై నోరు పారేసుకున్నారు. చట్టంలోని లొసుగులను అనేక విధాలుగా ఉపయోగించుకున్నారు. ఆఖరికి శుక్రవారం దోషులకు ఉరిశిక్ష అమలైన నేపథ్యంలో ఓటమిని తట్టుకోలేక మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
నేనైతే ఫాంహౌజ్‌కు తీసుకువెళ్లి..: దోషుల లాయర్